జిల్లా ఖనిజ ట్రస్టు నిధుల సేకరణ తేది పై తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం

District Mineral Foundation Trust Contributions Shall be made w.e.f. 17.09.2015 onwards


భారత కేంద్ర ప్రభుత్వం, గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 నకు పలు కీలక సవరణలు చేస్తూ, "గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2015" ను తేది:12.01.2015 నుండి అమలులోకి తీసుకొనిరావడమైనది. ఇట్టి సవరించబడిన చట్టం నందలి విభాగము 9(B) ను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్ సంబందిత కార్యకలాపాల వలన ప్రభావితమైన ప్రాంతాల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు ఆయా జిల్లాలలో "జిల్లా ఖనిజ ట్రస్టు"ను ఏర్పాటు చేసుకొనవలసి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం వారిచే జారీ చేయబడిన చట్టంలోని సవరణలను అనుసరించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 52, తేది: 21.08.2015 మరియు ఉత్తర్వుల సంఖ్య. 53, తేది:21.08.2015 ద్వార "జిల్లా ఖనిజ ట్రస్టు" ను నెలకొల్పుతూ ఉత్తర్వులు జారీచేయడమైనది. తదనంతరం, అట్టి ఉత్తర్వులను పూర్తిగా రద్దు పరుస్తూ, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 3, తేది:20.01.2016 ద్వార "తెలంగాణ రాష్ట్ర జిల్లాల ఖనిజ ట్రస్టు నియమావళి, 2015" ను రూపొందించడమైనది. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య. 4, తేది: 20.01.2016 ద్వార "జిల్లా ఖనిజ ట్రస్టు" తేది:12.01.2015 నుండి అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేయడమైనది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన "జిల్లా ఖనిజ ట్రస్టు" ఏర్పాటు మరియు వాటి అమలు తేదిల పై ఆగ్రహించిన కొందరు కౌలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించడమైనది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత ధర్మాసనం, వాదప్రతివాదనలు విన్న అనంతరం తేది: 13.10.2017 రోజున తుది తీర్పును వెలువరించడమైనది. అట్టి తీర్పును అనుసరించి, కేంద్ర ప్రభుత్వం వారిచే తొలుత తేది: 12.01.2015 రోజున జారీ చేయబడిన "గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2015" నందు "జిల్లా ఖనిజ ట్రస్టు" ఏర్పాటుపై ఆదేశాలు ఉన్నప్పటికీ, ఎంత మొత్తాన్ని విరాళాల రూపేణా సేకరించాలనే అంశంపై పూర్తి స్పష్టత లేనందున, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం వారిచే తేది: 17.09.2015 రోజు జారీ చేయబడిన, గనులు మరియు ఖనిజములు (జిల్లా ఖనిజ ట్రస్టు విరాళాల) నియమావళి, 2015 నందు స్పష్టముగా రాయల్టీపై 30% శాతాన్ని చెల్లించవలసినదిగా ఆదేశాలు ఉన్నందున, అట్టి తేదిని పరిగణలోకి తీసుకొని తేది: 17.09.2015 నుండి కౌలుదారులు జిల్లా ఖనిజ ట్రస్టుకు రాయల్టీ పై అదనంగా 30% శాతాన్ని జిల్లా ఖనిజ ట్రస్టుకు చెల్లించ వలసినదిగా ఆదేశించడమైనది. ఇందుకుగాను, కౌలుదారులకు తేది: 31.12.2017 వరకు గడువు ఇస్తూ, అట్టి గడువులో, చెల్లించని యడల 15% వడ్డీని విధించమని ఆదేశించడమైనది. ఎవరైనా, తేది:12.01.2015 నుండే ట్రస్టు నిధులు చెల్లించినట్లయితే, అట్టి అదనపు మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వకుండా, వారు  భవిష్యత్తులో చెల్లించబోయే మొత్తంలో సర్దుబాటు చెయ్యమని ఆదేశాలు జారీ చేయబడినది.

Download:

Supreme Court Judgement
GSR No. 715(E), Dt: 17.09.2015

జిల్లా ఖనిజ ట్రస్టు నియమావళి, 2015 నకు పలు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 83, తేది: 08.11.2017 ద్వార జిల్లా ఖనిజ ట్రస్టు నియమావళి, 2015 నకు పలు సవరణలు చేస్తూ, ట్రస్టు ద్వార చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన పథకం క్రింద జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ సమితి (దిశ) ద్వార పర్యవేక్షణ చేయుటకు ఆదేశాలు జారీచేయడమైనది. 

ప్రభుత్వ ఉత్తర్వులో కొన్ని ముఖ్యాంశాలు:
1. ట్రస్టు ద్వార జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయ పరచడానికి మరియు పర్యవేక్షణ చేయడానికి, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలనే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఖనిజ ట్రస్టు నియమావళి, 2015 నకు పలు సవరణలు చేయడమైనది.

2. ట్రస్టు ద్వారా జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ సమితి (దిశ) ద్వార పర్యవేక్షణ చేయబడును. ఈ సమితికి స్థానిక పార్లమెంటు సభ్యుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు.

3. ఒక వేళ ఒక జిల్లా నుండి ఒకరి కంటే ఎక్కువ పార్లమెంటు సభ్యులు ఎన్నుకోబడినట్లయితే, సీనియర్ పార్లమెంటు సభ్యుడు చైర్మెన్ గా, ఇతర సభ్యులు కో-చైర్మన్ గా వ్యవహరిస్తారు.

4. ఒక వేళ సీనియారిటి విషయంలో ఇద్దరు సభ్యులు సమాన స్థాయి ని కలిగి ఉన్నట్లయితే, భౌగోళికంగా ఆ జిల్లాలో ఎవరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం పెద్దగా ఉంటుందో ఆ సభ్యుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు.

5. అట్టి “దిశ” కమిటీకి సంబందిత జిల్లా కలెక్టరు మెంబర్–సెక్రటరీ గా వ్యవహరిస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితులలో సంబందిత జిల్లా కలెక్టర్ కు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి, జిల్లా పరిషత్ లేదా అదనపు జిల్లా మెజిస్ట్రేటు లను మెంబర్-సెక్రెటరీ గా నియమించే అధికారం కలదు.

6. జిల్లాలో గల ఎన్నుకోబడిన అందరు శాసన సభ్యులు, మునిసిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, ముఖ్య కార్య నిర్వాహణ అధికారి, జిల్లా పరిషత్తు, ప్రాజెక్టు డైరెక్టరు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, లీడ్ బ్యాంకు అధికారి,  చైర్మన్ మరియు ఇతర పార్లమెంటు సభ్యులతో ఎన్నుకోబడిన ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధి, పోస్టల్ శాఖ పర్యవేక్షణ అధికారి మరియు ఇతరలు, "దిశ" కమిటీలో సభ్యులుగా ఉంటారు.

7. కేంద్ర ప్రభుత్వం వారిచే రూపొందించబడిన సుమారు (28) పథకాల అమలు తీరును “దిశ” కమిటీ పర్యవేక్షణ చేస్తుంది.తెలంగాణ రాష్ట్ర ఇసుక త్రవ్వకాల నియమావళి, 2015 నకు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 84, తేది: 09.11.2017 ద్వార తెలంగాణ రాష్ట్ర ఇసుక త్రవ్వకాల నియమావళి, 2015 నకు సవరణ చేస్తూ, పట్టాభూములలో మేట వేసిన ఇసుకను తొలగించుగొనుటకు గాను పట్టాదారునికి క్యూబిక్ మీటర్ ఒక్కంటికి గరిష్టంగా రూ||100/- చెల్లించవలసినదిగా ఆదేశాలు జారీ చేసింది.